Ghantasala's Bhagawad Gita
Part 1

View This Page In English Fonts

పరిచయ వ్యాఖ్యానం: శ్రీ వ్యాసభగవానుని విరచితమైన శ్రీ మత్భగవత్గీత లో మొత్తం, 18 అధ్యాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. వాటి సారాంశాన్ని, కూర్చీ, కుదించి మనకు సులువుగా గీతా సారాంసాన్ని అందించే, 100 శ్లోకాల ఎంపిక చేసి , వాటి తాత్పర్యమను మన కందినచిన వారు: శ్రీ కె. ఎస్. రంగయ్య శాస్త్రి గారు. ఆ శ్లోకాలు పద్మశ్రీ ఘంటసాల గారు ఆలాపించి, ఫలశృతి, మంగళసాసన శ్లోకాలతో కలిపి, తాత్పర్య సహితముగా తన గానామృతముతో భక్తి వేదాంత భావాలు తొణికిసలాడిస్తూ మనందరికీ ప్రసాదించారు. మొదటి భాగము

001 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేనస్వయం 
  వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం
  అద్వ్యైతమృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం
  అంబ! త్వామనుసందధామి భగవద్గీతే భవ ద్వేషిణీం 
001 భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి,

002: న కాఙ్క్షే విజయఁ కృష్ణ న చ రాజ్యఁ సుఖాని చ 
   కిఁ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా       (01:32)  
స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ:

003 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే 
   గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః       (02:11)
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

004 దేహినోస్మిన్యథా దేహే కౌమారఁ యౌవనఁ జరా 
   తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి        (02:13)
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

005 వాసాఁసి జీర్ణాని యథా విహాయ  నవాని గృహ్ణాతి నరోపరాణి 
   తథా శరీరాణి విహాయ జీర్ణాని  అన్యాని సఁయాతి నవాని దేహీ            (02:22)
మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

006 నైనఁ చ్హిందంతి శస్త్రాణి నైనఁ దహతి పావకః 
   న చైనఁ క్లేదయంత్యాపో న శోషయతి మారుతః       (02:23) 
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.

007 జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువఁ జన్మ మృతస్య చ 
   తస్మాదపరిహార్యేర్థే న త్వఁ శోచితుమర్హసి         (02:27) 
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు .

008 హతో వా ప్రాప్స్యసి స్వర్గఁ జిత్వా వా భోక్ష్యసే మహీం  
   తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః       (02:37)

యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.

009 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన 
   మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోస్త్వకర్మణి        (02:47)
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.

010 దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః 
   వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే        (02:56)
దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.

011 ధ్యాయతో విషయాంపుఁసః సఙ్గస్తేషూపజాయతే 
   సఙ్గాత్సఁజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే      (02:62)
   క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః 
   స్మృతిభ్రఁశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి       (02:63)
విషయ వాంచలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

012 ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి 
   స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చ్హతి       (02:72)
ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.

013 లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ 
   జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాఁ కర్మయోగేన యోగినాం       (03:03)
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

014 అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః 
   యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః      (03:14)
అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

015 ఏవం ప్రవర్తితఁ చక్రం నానువర్తయతీహ యః 
   అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి        (03:16)
పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించుచునే యుండవలెను.

016 యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః 
   స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే           (03:21)
ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.

017 మయి సర్వాణి కర్మాణి సఁన్యస్యాధ్యాత్మచేతసా 
   నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః       (03:30)
అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.

018 శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్  
   స్వధర్మే నిధనఁ శ్రేయః పరధర్మో భయావహః      (03:35)

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

019 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ 
   యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం          (03:38)
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.

020 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 
   అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం        (04:07)
   పరిత్రాణాయ సాధూనాఁ వినాశాయ చ దుష్కృతాం  
   ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే       (04:08)
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సం రక్షణముల కొఱకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.

021 వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః 
   బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః        (04:10)
అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

022 యే యథా మాం ప్రపద్యంతే తాఁస్తథైవ భజామ్యహం  
   మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః      (04:11)
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.

023 యస్య సర్వే సమారంభాః కామసఙ్కల్పవర్జితాః 
   జ్ఞానాగ్నిదగ్ధకర్మాణఁ తమాహుః పణ్డితం బుధాః    (04:19)
ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితుడని విధ్వాంసులు పల్కుదురు.

024 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం  
   బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా       (04:24)
యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.

025 శ్రద్ధావా్ల్లభతే జ్ఞానం తత్పరః సఁయతేంద్రియః 
   జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చ్హతి     (04:39)
శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము.