Ghantasala's Bhagawad Gita
Part 2

View This Page In English Fonts

రెండవ భాగము

026 సఁన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ 
   తయోస్తు కర్మసఁన్యాసాత్కర్మయోగో విశిష్యతే         (05:02)
కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపానములు. అందు కర్మ పరిత్యాగము కన్న కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.

027 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గఁ త్యక్త్వా కరోతి యః 
   లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా          (05:10)
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక, బ్రహ్మార్పణముగా కర్మలనాచరించునో, అతడు తామరాకున నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు.

028 జ్ఞానేన తు తదజ్ఞానం యేషాఁ నాశితమాత్మనః 
   తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం        (05:16)
ఎవని అజ్ఞానము జ్ఞానముచేత నశింపబడునో, అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి, పరమార్థ తత్వమును చూపును.

029 విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని 
   శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః       (05:18)
విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందునూ, శునకమూ, శునకమాంసము వండుకొని తినువానియందునూ పండితులు సమదృష్టి కలిగియుందురు.

030 శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్    
   కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః      (05:23)
దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిష్డ్వర్గముల జయించునో, అట్టివాడు యోగి అనబడును.

031 యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః 
   విగతేచ్చ్హాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః       (05:28)
ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి, మనస్సునూ, బుద్ధినీ స్వాధీనమొనర్చుకొని మోక్షాసక్తుడై ఉండునో, అట్టివాడే ముక్తుడనబడును.

032 భోక్తారం యజ్ఞతపసాఁ సర్వలోకమహేశ్వరం   
   సుహృదం సర్వభూతానాఁ జ్ఞాత్వా మాఁ శాంతిమృచ్చ్హతి   (05:29)
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగనూ, సకల ప్రపంచ నియామకునిగనూ నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.

033 యం సఁన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ 
   న హ్యసఁన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన        (06:02)
అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగమనియూ అందురు. అట్టి యెడ సంకల్పత్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు.

034 యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు 
   యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా         (06:17)
యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మ సం యమ యోగము లభ్యము.

035 యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా 
   యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః          (06:19)
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే, మనో నిగ్రహముకలిగి, ఆత్మయోగ మభ్యసించినవాని చిత్తము నిశ్చలముగా నుండును.

036 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని 
   ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః         (06:29)
సకల భూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తన యందునూ, తనను అన్ని భూతములయందునూ చూచుచుండును.

037 అసఁశయం మహాబాహో మనో దుర్నిగ్రహఁ చలం  
   అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే         (06:35)

అర్జునా! ఎట్టివానికైననూ మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయిననూ, దానిని అభ్యాస, వైరాగ్యములచేత నిరోధింపవచ్చును.

038 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా 
   శ్రద్ధావాంభజతే యో మాఁ స మే యుక్తతమో మతః      (06:47)
అర్జునా! పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయించి, వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

039 మనుష్యాణాఁ సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే 
   యతతామపి సిద్ధానాఁ కశ్చిన్మాఁ వేత్తి తత్త్వతః     (07:03)
వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొఋఅకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసు కొనగలుగుచున్నాడు.

040 భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ 
   అహఁకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా        (07:04)
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన బేధములతో ఒప్పి యున్నదని గ్రహింపుము.

041 మత్తః పరతరం నాన్యత్కిఁచిదస్తి ధనఁజయ 
   మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ          (07:07)
అర్జునా! నా కన్న గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు యీ జగమంతయూ నాయందు నిక్షిప్తమై ఉన్నది.

042 పుణ్యో గంధః పృథివ్యాఁ చ తేజశ్చాస్మి విభావసౌ 
   జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు        (07:09)
భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెల్ల భూతములయందు ఆయువు, తపస్వులయందు తపస్సు నేనుగా నెరుగుము.

043 దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా 
   మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే         (07:14)
పార్థా! త్రిగుణాత్మకము, దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింప రానిది. కాని, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.

044 చతుర్విధా భజంతే మాఁ జనాః సుకృతినోర్జున 
   ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ    (07:16)
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు.

045 బహూనాఁ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే 
   వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః        (07:19)
జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట, విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.

046 అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం   
   యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సఁశయః    (08:05)
ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.

047 అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా 
   పరమం పురుషం దివ్యఁ యాతి పార్థానుచింతయన్       (08:08)
   కవిం పురాణమనుశాసితారం  అణోరణీయఁసమనుస్మరేద్యః 
   సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్  (08:09)
అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు; పురాణ పురుషుడు; ప్రపంచమునకు శిక్షకుడు; అణువు కన్నా అణువు; అనూహ్యమైన రూపము కలవాడు; సూర్య కాంతి తేజోమయుడు; అజ్ఞానాంధకారమునకన్న ఇతరుడు.

048 అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాఁ గతిం     
   యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ  (08:21)
ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.

049 శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే 
   ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః   (08:26)
జగత్తునందు శుక్ల కృష్ణము లనెడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దానివలన పునర్జన్మము కలుగు చున్నవి.

050 వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం  
   అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం  (08:28)
యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక, ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు.

051 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిఁ యాంతి మామికాం  
   కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం         (09:07)
పార్థా! ప్రళయకాలమున సకల ప్రాణులును నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులనూ నేనే సృష్టించు చున్నాను.

052 అనన్యాశ్చింతయంతో మాఁ యే జనాః పర్యుపాసతే 
   తేషాఁ నిత్యాభియుక్తానాఁ యోగక్షేమం వహామ్యహం     (09:22)
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించు చుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించు చున్నాను.

053 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చ్హతి 
   తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః         (09:26)
ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

054 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాఁ నమస్కురు 
   మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః       (09:34)
పార్థా! నా యందు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు.

ఇది ఉపనిషత్తుల సారాన్శమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.