Ghantasala

B.N.Reddy

Editors Note: This article is in Unicode; If you cannot see the Telugu script, please scroll down to read the RTS Transcription, or see the pdf version here

అది 1943 వ సంవత్సరం. మా "స్వర్గసీమ" చిత్ర నిర్మాణానికి యేర్పాట్లు చెస్తూ ఉన్న రోజులు. రోజూ ఉదయం ఏడు గంటలకు నేను ఆఫీసుకు వెళ్ళి చిత్రానికి screen play వ్రాసుకుంటూ ఉండేవాణ్ణి. Office పది గంటలకు ప్రారంభం కావడంతో ఎవరి అంతరాయం లేకుండ పనిసాగేది.

ఒకనాడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతాన, తియ్యని గాత్రంతొ కర్నాటక రాగాలాపన, ఆ తరువాత తెలుగు భాషకు వన్నె తెచ్చే ఒక భావయుక్తమైన త్యాగయ్య కృతి విన్నాను. గాత్రం నాగయ్యది కాదు. నా వ్రాతపని ఆగిపోయింది. నా గది పక్కనే మా సంగీత శాఖ గది ఉండేది. నేను లేచి తిన్నగా అటువైపు వెళ్ళాను. తెల్లని ఖద్దరు లాల్చీతో, కొంత బొద్దుగా, మందహాసమొలికే పెదవులతో ఒక యువకుడు హార్మోనియం వాయించుకుంటూ పాడుతున్నాడు. ఆ యువకునికి దగ్గరగా పూజ్యశ్రీ సముద్రాల రాఘవాచారి గారు తాంబూలం సేవిస్తూ నన్ను చూడగానే "రా భాయీ" అని పిలిచారు. "ఎవరీ కుర్రవాడు" అని అడిగాను. "మనవాడే మా వూరి అబ్బాయి. విజయనగరం నాయుడు గారి వద్ద సంగీతం అభ్యసించాడు. పేరు ఘంటసాల వేంకటేశ్వరరావు, అంటూ ఆయనని నాకు పరిచయం చేశారు. నేను వారి వద్ద కూర్చుని చాల కమ్మగా పాడుతున్నాడు, మన నాగయ్యకు పరిచయం చేశావా అని అడిగాను. అందుకోసమే ఎనిమిది గంటలకు వచ్చాను, బావ కూడా యిప్పుడే వస్తాడు అన్నారు. (శ్రీ నాగయ్యను ఆచారిగారు బావ అని పిలిచేవారు) శ్రీ ఘంటసాలగారితో తొలి పరిచయం నాకు ఆనాడు జరిగింది. ఆయన చేయెత్తి నమస్కరించిన దృశ్యం నాలో యింకా మాసిపోలేదు. ఆ తరువాత తరచుగా మా ఆఫీసుకు వస్తూ పోతూ ఉండేవారు ఆయన. అవకాశం ఉన్నప్పుడల్లా ఘంటసాల పాడగ నేను మా నాగయ్యగారు ఆనందంగా వింటూ వుండేవారం. "స్వర్గసీమ" Music rehearsal జరిగేటప్పుడు చూస్తూ నాగయ్యగారు చేస్తున్న సంగీత దర్శకత్వం గమనిస్తూ ఉండేవారు. "స్వర్గసీమ" చిత్రంలొ ఘంటసాల వారితో శ్రీమతి భానుమతిగారితో ఒక Duet పాడించాము.

ఆ తరువాత నేను వాహిని స్టూడియో నిర్మాణ కార్య కలాపాలలో ఉండిపోయాను. శ్రీ ఘంటసాల, శ్రీ సుబ్బరామన్‌ తో కలిసి పని చేసేవారు. మా వాహిని studio మా తమ్ముడు శ్రీ నాగిరెడ్డి తీసుకున్నప్పుడు వారి విజయ productions సంగీత దర్శకులుగా యెన్నో చిత్రాలలుకు పనిచేసారు ఘంటసాల. వారిని స్టూడియోలో చూసేవణ్ణి. "మాస్టారూ" అంటూ నన్నెంతో ఆప్యాయంగా పలకరించేవారు. కొన్ని సంవత్సరాలు దక్షిణ భారత సినిమాలలో, ఆయా భాషలలో వీరి పాటకే అగ్రస్థానం. చలనచిత్ర రంగంలో ప్రముఖులలో ప్రముఖులై ఆబాల గోపాలానికి ప్రేమాస్పదులైనారు. శ్రీ సైగల్‌ పాటలు రికార్డు చేసిన శ్రీ ముకుల్‌ బోస్‌ లాంటివారు, సప్తస్వరాలతో నిండుగా పలికే మధుర గాత్రం ఘంటసాల గారిదని ప్రశంసించారు.

మన ఘంటసాల మామూలు వ్యక్తి కాదు. ఒక గంధర్వుడు. మానవ రూపంలో మన ముందు కొన్నాళ్ళు నివసించి పై నుండి పిలుపు రాగానే వెళ్ళిపోయారు. పండిత పామరులన్న తేడా లేకుండా తన మధుర గాన వాహినిలో అందరినీ ఆనందపరవశుల్ని చేసి వెళ్ళిపోయారు. లలిత సంగీతం లోకంలో మనినంతకాలం పద్మశ్రీ ఘంటసాల చిరంజీవి. దాదాపు 10, 000 పాటలుకు పాడి, పైగా యెన్నో చిత్రాలుకు సంగీత దర్శకునిగా పని చేసి, వందలాది సంగీత కచేరీలు చేసి, అవసరం వచ్చిన్నప్పుడల్లా మన జాతీయ ఉద్యమంతో దేశ శ్రేయస్సుకు తన గాత్రాన్ని తోడిచ్చిన ఉదారుడు, దేశభక్తుడు తన త్యాగాన్ని నిరూపించాడు. యెందరో గేయ రచయితలు, సినీ కళాకారులు, సినీ ప్రేక్షకులు, చిత్ర నిర్మాతలు ఋణపడివున్నారు. కొందరు అనవచ్చు --వారి పాటలకు డబ్బులిచ్చామే, ఋణం తీరిందని-- క్షమించండి: లలితకళా సంపన్నులు మానవ హృదయానికిచ్చే ఆనందాన్ని తూచగల ధనం యే లొకంలో లేదు. యిలాంటి వరప్రసాదులుకు మనం యివ్వగలిగినది మన కృతజ్ఞాభివందనాలు. అంతకు మించి మనం యేమి యివ్వలేము. యిలాంటి కళాకారులు లోకంలో లేకపోతే లోకం వెన్నెలలేని రాత్రిగా మారిపోతుంది. అంతర్జాతీయంగా తన గానామృతంతో విదేశీయుల వీనులు విందుచేసి యిటీవలే తిరిగొచ్చారు. యింతటి ప్రతిభావంతుదు, యశోవంతుడు యెప్పుడూ పసిపాపలాగు మందహాసంతో మూర్తీభవించిన వినయవిధేయలతో, "అయ్యా," "బాబూ," "మాస్టరుగారు" అంటూ చల్లగా అందరినీ పలకరించి పరామర్శించేవారు. ఆ స్నేహమూర్తి పలుకులు యెప్పటికీ మన చెవిలో వినిపిస్తూనే వుంటాయి.

జీవితంలో వీరి గాత్రన్ని కాపాడుకున్నారుగాని, ఊపిరాడని కార్యక్రమాలతో శరీరాన్ని కొంత నిర్లక్ష్యం చేశారు. కొంత కాలంగా వారిని డాక్టర్లు శ్రమ తగ్గించి విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఆ కళాత్మక హృదయం యీ సలహాను అంతగా పట్టించుకోలేదు. తన ఆరోగ్యాన్ని లెక్కచేయక, శ్రీ భగవద్గీతలోని శ్లోకాలన్నీ తాత్పర్య సహితంగా గ్రామఫోను రికార్డు యిచ్చారు. ఆ రికార్డు వెలువడి పద్మశ్రీ ఘంటసాల ప్రతి యింటా నివసించగలరు. వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారి ఆరోగ్య విషయం ప్రతి రోజు డాక్టర్ల వద్ద అడిగి తెలుసుకునే వాణ్ణి. ఆసుపత్రిలొ వారు ఆయసంతో మంచం మీద పడుకొని నన్ను చూచి తన బాధను మ్రింగి, "మాస్టారు, యీ ఆయసంతో నేను మీ యింటికి స్వయంగా రాలేకపోయాను", అన్నారు. "పద్మభుషణ శుభాకాంక్షలు చెప్పలేకపోయను". వారి ప్రమాద స్థితిని తెలిసి వచ్చిన కన్నీరు యెంతో కష్టం మీద ఆపుకొని, "మీరు దయచేసి మాట్లాడకండి. మీరు స్వస్థత చెంది యింటికి రాగానే నేనే వచ్చి మీతో మాట్లాడుతాను" అన్నాను. అంతే, ఆ తరువాత రెండు రోజులకు వారింటికి వెళ్ళాను. మందహాసంతో శాశ్వతంగా కన్ను మూసిన వారి భౌతిక దేహానికి పుష్పమాల మత్రం వెయ్యగలిగాను. నాకు దక్కిందంతే.

ఆ పుణ్యాత్మునకు చేయెత్తి నమస్కరించి, వారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.


adi 1943 va saMvatsaram. maa "swargaseema" chitra nirmaaNaaniki yErpaaTlu chestoo unna rOjulu. rOjoo udayam EDu ganTalaku nEnu aapheesuku veLLi chitraaniki #screen play# vraasukuMToo unDEvaaNNi. #Office# padi gaMTalaku praaraMbhaM kaavaDaMtO evari antaraayam lEkunDa panisaagEdi.

okanaaDu udayam enimidi ganTala praantaana, tiyyani gaatraMto karnaaTaka raagaalaapana, aa taruvaata telugu bhaashaku vanne tecchE oka bhaavayuktamaina tyaagayya kRti vinnaanu. gaatram naagayyadi kaadu. naa vraatapani aagipOyiMdi. naa gadi pakkanE maa saMgeeta Saakha gadi unDEdi. nEnu lEchi tinnagaa aTuvaipu veLLaanu. tellani khaddaru laalcheetO, konta boddugaa, maMdahaasamolikE pedavulatO oka yuvakuDu haarmOniyaM vaayiMchukunToo paaDutunnaaDu. aa yuvakuniki daggaragaa poojyaSree samudraala raaghavaachaari gaaru taaMboolam sEvistoo nannu chooDagaanE "raa bhaayee" ani pilichaaru. "evaree kurravaaDu" ani aDigaanu. "manavaaDE maa voori abbaayi. vijayanagaraM naayuDu gaari vadda sangeetaM abhyasiMchaaDu. pEru ghanTasaala vEMkaTESwararaavu, aMToo aayanani naaku parichayaM chESaaru. nEnu vaari vadda koorchuni chaala kammagaa paaDutunnaaDu, mana naagayyaku parichayaM chESaavaa ani aDigaanu. andukOsamE enimidi ganTalaku vacchaanu, baava kooDaa yippuDE vastaaDu annaaru. (Sree naagayyanu aachaarigaaru baava ani pilichEvaaru) Sree ghanTasaalagaaritO toli parichayam naaku aanaaDu jarigindi. aayana chEyetti namaskariMchina dRSyam naalO yinkaa maasipOlEdu. aa taruvaata tarachugaa maa aapheesuku vastoo pOtoo unDEvaaru aayana. avakaaSam unnappuDallaa ghanTasaala paaDaga nEnu maa naagayyagaaru aanaMdaMgaa vinToo vunDEvaaraM. "swargaseema" #Music rehearsal# jarigETappuDu choostoo naagayyagaaru chEstunna saMgeeta darSakatwam gamanistoo uMDEvaaru. "swargaseema" chitraMlo ghanTasaala vaaritO Sreemati bhaanumatigaaritO oka #Duet# paaDiMchaamu.

aa taruvaata nEnu vaahini sTooDiyO nirmaaNa kaarya kalaapaalalO uMDipOyaanu. Sree ghanTasaala, Sree subbaraaman^ tO kalisi pani chEsEvaaru. maa vaahini #studio# maa tammuDu Sree naagireDDi teesukunnappuDu vaari vijaya #productions# sangeeta darSakulugaa yennO chitraalaluku panichEsaaru ghanTasaala. vaarini sTooDiyOlO choosEvaNNi. "maasTaaroo" anToo nanneMtO aapyaayaMgaa palakariMchEvaaru. konni saMvatsaraalu dakshiNa bhaarata sinimaalalO, aayaa bhaashalalO veeri paaTakE agrasthaanam. chalanachitra rangaMlO pramukhulalO pramukhulai aabaala gOpaalaaniki prEmaaspadulainaaru. Sree saigal^ paaTalu rikaarDu chEsina Sree mukul^ bOs^ laanTivaaru, saptaswaraalatO niMDugaa palikE madhura gaatraM ghaMTasaala gaaridani praSaMsinchaaru.

mana ghanTasaala maamoolu vyakti kaadu. oka gandharvuDu. maanava roopaMlO mana mundu konnaaLLu nivasinchi pai nuMDi pilupu raagaanE veLLipOyaaru. paMDita paamarulanna tEDaa lEkunDaa tana madhura gaana vaahinilO andarinee aanaMdaparavaSulni chEsi veLLipOyaaru. lalita saMgeetam lOkaMlO maninaMtakaalam padmaSree ghanTasaala chiranjeevi. daadaapu 10, 000 paaTaluku paaDi, paigaa yennO chitraaluku saMgeeta darSakunigaa pani chEsi, vaMdalaadi saMgeeta kachEreelu chEsi, avasaram vacchinnappuDallaa mana jaateeya udyamaMtO dESa SrEyassuku tana gaatraanni tODicchina udaaruDu, dESabhaktuDu tana tyaagaanni niroopiMchaaDu. yendarO gEya rachayitalu, sinee kaLaakaarulu, sinee prEkshakulu, chitra nirmaatalu RNapaDivunnaaru. kondaru anavacchu --vaari paaTalaku DabbulicchaamE, RNam teerindani-- kshamiMchaMDi: lalitakaLaa sampannulu maanava hRdayaanikicchE aanandaanni toochagala dhanaM yE lokaMlO lEdu. yilaanTi varaprasaaduluku manam yivvagaliginadi mana kRtaj~naabhivandanaalu. aMtaku minchi manam yEmi yivvalEmu. yilaaMTi kaLaakaarulu lOkaMlO lEkapOtE lOkam vennelalEni raatrigaa maaripOtundi. antarjaateeyaMgaa tana gaanaamRtaMtO vidESeeyula veenulu vinduchEsi yiTeevalE tirigocchaaru. yintaTi pratibhaavantudu, yaSOvaMtuDu yeppuDoo pasipaapalaagu mandahaasaMtO moorteebhaviMchina vinayavidhEyalatO, "ayyaa," "baaboo," "maasTarugaaru" anToo challagaa aMdarinee palakariMchi paraamarSiMchEvaaru. aa snEhamoorti palukulu yeppaTikee mana chevilO vinipistoonE vuMTaayi.

jeevitaMlO veeri gaatranni kaapaaDukunnaarugaani, oopiraaDani kaaryakramaalatO Sareeraanni konta nirlakshyam chESaaru. konta kaalaMgaa vaarini DaakTarlu Srama tagginchi viSraaMti teesukOmannaaru. kaanee aa kaLaatmaka hRdayam yee salahaanu antagaa paTTiMchukOlEdu. tana aarOgyaanni lekkachEyaka, Sree bhagavadgeetalOni SlOkaalannee taatparya sahitaMgaa graamaphOnu rikaarDu yicchaaru. aa rikaarDu veluvaDi padmaSree ghaMTasaala prati yinTaa nivasiMchagalaru. vaaru aasupatrilO unnappuDu vaari aarOgya vishayam prati rOju DaakTarla vadda aDigi telusukunE vaaNNi. aasupatrilo vaaru aayasaMtO mancham meeda paDukoni nannu choochi tana baadhanu mringi, "maasTaaru, yee aayasaMtO nEnu mee yinTiki swayaMgaa raalEkapOyaanu", annaaru. "padmabhushaNa Subhaakaankshalu cheppalEkapOyanu". vaari pramaada sthitini telisi vacchina kanneeru yentO kashTam meeda aapukoni, "meeru dayachEsi maaTlaaDakaMDi. meeru swasthata cheMdi yiMTiki raagaanE nEnE vacchi meetO maaTlaaDutaanu" annaanu. antE, aa taruvaata reMDu rOjulaku vaariMTiki veLLaanu. maMdahaasaMtO SaaSwataMgaa kannu moosina vaari bhautika dEhaaniki pushpamaala matram veyyagaligaanu. naaku dakkiMdantE.

aa puNyaatmunaku chEyetti namaskariMchi, vaari aatmaku Saantini prasaadiMchamani bhagavaMtuni praarthistunnaanu.